10-May-2019 News Clips

10-May-2019 News Clips
Balyam Jyothy Tirupati 10-05-2019

వేసవిలో సెలవుల్లో…

బాల్యం ఒక జ్ఞాపకాల పూదోట
టీటీడీ జేఈవో లక్ష్మీకాంతం చిన్ననాటి సంగతులు
(ఆంధ్రజ్యోతి,తిరుపతి)
ఆయన చిత్తూరుజిల్లా వాసి. బావుల్లో ఈదులాడి, తాటితోపుల్లో తిరుగులాడి.. ఇంటిపనులూ, పశువుల పనులూ చూస్తూ చదువును అశ్రద్ధ చేయని బాల్యం ఆయనది. టీటీడీ పరిపాలనా విభాగం జేఈవో గా కీలక బాధ్యతల్లో ఉన్న బి.లక్ష్మీకాంతం చిన్ననాటి సంగతులు ఇవి.. ఆయన మాటల్లోనే..
వేసవిలో సెలవుల్లో…
 మాది చిత్తూరు పక్కన గుడిపాల మండలం మండలం పిళ్ళారికుప్పం అనే చిన్న పల్లెటూరు. నాన్న బాలయ్యనాయుడు, అమ్మ సుభద్రమ్మ, ముగ్గురు అక్కల తర్వాత ఇంట్లో చివరివాడిని నేనే. పేరుకు పల్లెటూరే అయినా నా చిన్నతనంలోనే నాన్న చిత్తూరులో స్థిరపడి వ్యాపారం చేసేవారు. శోభా డ్రెస్సెస్‌ పేరిట బట్టల దుకాణం వుండేది. బంగారుపాళ్యం జమీందారు హైస్కూలు, పీసీఆర్‌ హైస్కూళ్ళలో టెన్త్‌ వరకూ చదువుకున్నా. ఎండాకాలం లీవులంటే చాలు మా ఊరికి పరుగులు తీయాల్సిందే. ఒక్క రోజు చిత్తూరులో గడపాలన్నా ముళ్ళమీద వున్నట్టే వుండేది. పిళ్ళారికుప్పంతో పాటు చుట్టుపక్కల వసంతాపురం, గుడిపాల, చిత్తపార అనే చోట్ల కూడా దగ్గర బంధువులుండేవారు. సెలవుల్లో ఆ ఊళ్ళన్నీ చుట్టేసేవాళ్ళం. ఒకో పల్లెలో పది రోజులు గడిచిపోయేది. నాలుగు పల్లెలు తిరిగేసరికే సెలవులన్నీ అయిపొయ్యేవి. పగలంతా బావుల్లో ఈతలాడిఆడి అలసిపొయ్యేవాళ్ళం. గట్టు మీదకి రాంగానే తాటి ముంజలు గుర్తొచ్చేవి. మా ప్రాంతంలో తాటి చెట్లు విపరీతంగా వుంటాయి. ముంజుల రుచి ముంజులది. మిగలపండిన తాటి పండు కూడా భలే ఉంటుంది. తాటి తాండ్ర ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా వుండేది.
 
ఆటలతో పాటూ..ఇంటి పనీ, పశువుల పనీ!
పల్లెఆటలను నిశితంగా పరిశీలిస్తే అవి పిల్లల సామర్థ్యాలను చాటుతాయి. కొండగుట్టలు, చెట్లు ఎక్కడం వల్ల శారీరక ధారుఢ్యంతో పాటు ధైర్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతాయి. పోటీ తత్వం పెరుగుతుంది. ఉదాహరణకు మేము ఈత ఆడే సమయంలో చాలా ఎత్తు నుంచీ పల్టీలు కొడుతూ బావిలోకి దూకేవాళ్ళం. ఎవరెంత ఎత్తు నుంచీ దూకితే అంత గొప్ప. ఎన్ని పల్టీలు కొడుతూ దూకితే వాడంత హీరో. అలాంటప్పుడు బాగా దెబ్బలు కూడా తగిలేవి. వాటికి మించి ఇంట్లో పెద్దవాళ్ళ నుంచీ తిట్లూ దెబ్బలూ పడేవి. ఒకసారి ఈతాడే సమయంలో తమాషాగా పోట్లాటకు దిగాం. ఒకడు చేత్తో నా కుడి కంటి వద్ద పొడిచేశాడు. కన్ను పొయ్యేంత పనైంది. బాగా దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. ఇపుడు పిల్లలను వెంట తోడు లేకుండా తల్లిదండ్రులు ఎక్కడికీ పంపడంలేదు. ఏ పనీ స్వంతంగా చేయనివ్వడంలేదు. మా రోజుల్లో పరిస్థితి ఇలా వుండేది కాదు. ఆటపాటలతో పాటు ఇంటిపనీ, పశువుల పనీ, పొలం పనీ అన్నీ చేసేవాళ్ళం.
ఫుట్‌ బాల్‌ ఆటే సర్వస్వం
1969-1974 నడుమ హైస్కూలులో వున్నపుడు ఫుట్‌బాల్‌ అంటే విపరీతమైన ఇష్టముండేది. చిత్తూరు మెసానికల్‌ గ్రౌండ్స్‌లో ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచీ 6 దాకా గంటసేపు తప్పనిసరిగా ఫుట్‌బాల్‌ ఆడేవాడిని. సెలవు రోజుల్లో అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచీ రాత్రి 7 గంటల దాకా గ్రౌండ్‌లోనే మకాం.. ఎండ, వాన, చలి, వేడి అని తెలిసేది కాదు.. ఫుట్‌బాల్‌ ఆటే సర్వస్వంగా వుండేది. ఆ పిచ్చి ఎంత వుండేదంటే గేమ్‌లో ఓడిపోతే ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఆపోజిట్‌ టీమును మాటలతో రెచ్చగొట్టి మళ్ళీ గేమ్‌ ఆడేలా పురిగొల్పేవాడిని. చీకటి పడినా సరే గేమ్‌ ఆడి మా టీమ్‌ గెలిచాకే ఇంటిదారి పట్టేవాళ్ళం. అంత పట్టుదల. ప్రతి రోజూ సాయంత్రం ఫుట్‌ బాల్‌ ఆడాక పాత బస్టాండుకు ఎగవన వున్న అజంతా హోటల్‌కు పోయి పావలా ఇచ్చి మసాలా దోసె తినేవాళ్ళం.
ఆ ఇద్దరు అయ్యోర్లకు వందనం
ఎండాకాలం సెలవుల్లో ఎన్ని ఆటలు ఆడినా, ఇంట్లో పెద్దవాళ్ళ నుంచీ ఎన్ని తిట్లు, దెబ్బలు తిన్నా స్కూలు తెరిస్తే చాలా బుద్ధిమంతుడిని అయిపోయేవాడిని. చదువు విషయంలో రాజీ పడేవాడిని కాదు. రామ్మూర్తి అని ఇంగ్లీషు టీచరు, శేషయ్య అని తెలుగు టీచర్‌ వుండేవారు. పాఠాలు అద్భుతంగా చెప్పేవారు. ఇవాళ ఇంగ్లీషు, తెలుగు భాషల మీద ఈ మాత్రం పట్టు వుందంటే అది అప్పట్లో వాళ్ళు వేసిన పునాదే కారణం. అలాంటి టీచర్ల పుణ్యమాని సెవెన్త్‌లోనే నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ సాధించా. తొలి సారి రూ. 500 వచ్చింది. దాంట్లోనే రూ. 300 ఖర్చుపెట్టి హ్యామిల్టన్‌ సైకిల్‌ కొన్నా. అలా ఏడవ తరగతిలో పొందిన మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ దాకా కొనసాగింది. తర్వాత రీసెర్చి స్కాలర్‌గా కూడా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచీ ఫెలోషిప్‌ అందుకున్నా. సెవెన్త్‌లో నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ రావడం వల్లే చదువుపై శ్రద్ధ పెరిగింది. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది కూడా. చిత్తూరు బీజెడ్‌, పీసీఆర్‌ హైస్కూళ్ళలో విపరీతమైన క్రమశిక్షణ వుండేది. ముందు క్రమశిక్షణ, తర్వాతే చదువు అనేలా వుండేది టీచర్ల తీరు.
ఆనాటి స్నేహం .. ఈనాటికీ
చిన్ననాటి స్నేహితులతో అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చిత్తూరులో బాల్య స్నేహితుల్లో సురేష్‌ ఇపుడు కాంట్రాక్టరుగా వుంటూ పెట్రోలు పంప్‌, సినిమా థియేటర్‌ నిర్వహిస్తున్నారు. ఇక విజయచంద్రరెడ్డి అడ్వకేట్‌గా వున్నారు. రమేష్‌ డెంటిస్టుగా ప్రాక్టీస్‌ పెట్టుకోగా ఏకాంతంరెడ్డి ఫీడ్‌ సప్లయర్‌గా వ్యాపారం చేస్తున్నారు. వీరంతా నా హైస్కూలు ఫ్రెండ్స్‌. అందరం కలిసి మా బంధువుల ఊళ్ళకు వెళ్ళేవాళ్ళం. అప్పటి హైస్కూల్‌ మిత్రులందరం ఇప్పటికీ విధిగా ఏటా ఒకరోజు కలుస్తూనే వున్నాం.
ఇప్పుడు ఆటపాటల్లేవు
నా చిన్నతనంలో లీవులంటే ఆటపాటలనే అర్థం. ఆడుకోవడం, సంతోషంగా గడపడం తప్ప మరేమీ తెలిసేది కాదు. ఆటపాటలే ప్రపంచంగా వుండేది. అప్పుడు కూడా టీచర్లు స్పెషల్‌ క్లాసులని లీవుల్లో పెట్టుకునేవాళ్లు. అయితే మేమెవ్వరం వాటికి పొయ్యేవాళ్ళం కాదు. ఎండాకాలం లీవులు పూర్తిగా అయిపోయి మళ్ళా స్కూలు తెరిచేదాకా చదువనే మాటే వుండేదికాదు. మా పిల్లల్ని వేసవి సెలవుల్లో ఆడుకోండి అని చెప్పినా బయటకు కదిలేవాళ్లు కాదు. ఎంతసేపూ కంప్యూటర్‌, వాటిలో గేమ్స్‌ తప్ప పిల్లలతో కలసి ఆడుకోవడమనేదే తెలియకుండా పోయింది. ఇపుడు వాళ్ళకీ పిల్లలు పుట్టేశారు. ఇక ఈతరం ఇంకెత ఆటలాడుతుందో ఊహించుకోవచ్చు.
‘‘వేసవి సెలవుల్ని ఆటపాటలకు గాక, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడానికి వినియోగించుకోవాలన్న ఆలోచన పిల్లలకు కాదు తల్లిదండ్రులకి కలుగుతోంది. సొంత ఊళ్ళకు, బంధువుల ఊళ్ళకు వెళ్ళడం వెళ్ళడం దాదాపుగా ఆగిపోయింది. స్పెషల్‌ క్లాసులూ, రివిజన్‌ క్లాసులూ, కంప్యూటర్‌ కోర్సులు, సమ్మర్‌ క్యాంపుల పేరిట పాఠ్యపుస్తకాలకు అధనంగా ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఆరాటపడుతున్నారు. మా బాల్యం నాటి మధుర జ్ఞాపకాలు వీళ్ళకి ఉండవు కదా అని బాధ కలుగుతోంది.
’’ బాల్యమంటే ఇపుడో ఆంక్షల చట్రం… సెలవుల్లోనూ దానికి విముక్తి లేదు… మా తరంలో అలా కాదు… అదో స్వేచ్ఛతో కూడిన ఆటపాటల ప్రపంచం. అందుకే వేసవి సెలవులొచ్చాయంటే చాలు పిల్లలకు రెక్కలొచ్చినట్టే.. పల్లె ఒక్కటే కాదు చుట్టుపక్కల కొండాగుట్టా… వాగూ వంకా… చెరువూ బావీ… తోటా అన్నీ ఆట స్థలాలే అయ్యేవి. అమ్మమ్మా, నానమ్మల ఊళ్ళే కాదు మేనత్త, మేనమామ, చిన్నాన్న, పెద్దనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మల ఊళ్ళకూ పరుగులు తీసేవాళ్ళం. బంధుత్వాలూ బలపడేవి.

Balyam Jyothy Tirupati-city-10-05-2019


 

img-20190510-wa00271908737000.jpgimg-20190510-wa00151737659334.jpgimg-20190510-wa0026923083291.jpgimg-20190510-wa0028242023757.jpgimg-20190510-wa00191309843160.jpgimg-20190510-wa0023-1825101654.jpgimg-20190510-wa0020-1361715005.jpgimg-20190510-wa00291390613152.jpgimg-20190510-wa0031-785553205.jpgimg-20190510-wa0016-2127665945.jpgimg-20190510-wa001894562524.jpgimg-20190510-wa0024-1648587144.jpgimg-20190510-wa0022-848978243.jpgimg-20190510-wa0021326426296.jpgimg-20190510-wa00321566849169.jpg


Balyam Jyothy Tirupati 10-05-2019

Leave a comment