27-February-2019-NewsClips









https://epaper.andhrajyothy.com/c/37105863

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి చరిత్ర, విశిష్టత, ఆలయ నిర్మాణం, ఉత్సవాలు, సేవలు… వంటి సమస్త సమాచారంతో ‘తిరుమల- కలియుగ వైకుంఠం’ పేరిట ఒక ‘కాఫీ టేబుల్ బుక్’ రూపుదిద్దుకుంటోంది. ఈ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తమిళ దంపతులైన జగన్నాథ రమణన్, బృందా రమణన్‌లకు అప్పగించింది. ఈ పుస్తకం రాసే క్రమంలో ఏడాది పాటు వాళ్లిద్దరూ తిరుమలలో పర్యటించారు. వారికి కలిగిన అనుభవాలు, పుస్తక విశేషాలను ఆ దంపతులు ‘నవ్య’తో పంచుకున్నారు.

ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరంగంలోని శ్రీరంగనాధుడికి టీటీడీ పట్టువస్ర్తాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వస్ర్తాలు సమర్పించేందుకు గత ఏడాది శ్రీరంగం వచ్చారట. ఆ సమయంలో మేము ఏడాది పాటు కృషిచేసి రూపొందించిన ‘శ్రీరంగం- భూలోక వైకుంఠం’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని అక్కడి కమిషనర్ పొన్ను జయరామన్ ఈవోకు అందజేశారు. ఆ పుస్తకాన్ని చూసిన ఈవో మా వివరాలు సేకరించారు. ‘ఫొటోలతో చాలా చక్కగా శ్రీర ంగం విశిష్టతను తెలుపుతూ రాసారని, ఇదే తరహాలో టీటీడీ కోసం కూడా ఓ కాఫీ టేబుల్ పుస్తకాన్ని రూపొందించాల’ని కోరారు. ఇది నిజంగా ఆ శ్రీనివాసుడి పిలుపు అనుకుని మేము అందుకు సంతోషంగా ఒప్పుకున్నాం. ప్రాజెక్టులో భాగంగానే 2018 మార్చి నెలలో తిరుమలకు చేరుకుని మా పరిశీలనను ప్రారంభించాం. తుంబురతీర్థంతో మా పరిశీలన, పరిశోధన ప్రారంభించాం. శ్రీరంగనాధస్వామికి సంబంధించిన పుస్తకానికి ‘శ్రీరంగం-భూలోక వైకుంఠం’గా పేరు పెడితే శ్రీవారికి సంబంధించిన పుస్తకానికి ‘తిరుమల-కలియుగ వైకుంఠం’ అనే పేరు పెట్టాం.
బుక్‌లో ఏముంటాయంటే…
ఈ కాఫీ టేబుల్ బుక్‌లో ఎలాంటి అంశాలను పొందుపరచాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. శ్రీవేంకటేశ్వరస్వామి తిరుమలకు ఎలా వచ్చారు? ఆలయ చరిత్ర ఏంటి? నిర్మాణం ఎలా ఉంది? ఆలయం లోపల ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి?… సన్నిధిలో మూలమూర్తి గురించి ఈ పుస్తకం ప్రారంభంలో ఉంటాయి. అదేవిధంగా ఏడాది పొడవున తిరుమలలో జరిగే నిత్య, వార, మాస, వార్షిక ఉత్సవాలు… వాటిని ఎవరు ఎలా జరుపుతారు? ఏ సమయాల్లో జరుగుతాయి?… వంటి విశేషాలు కూడా పొందుపరుస్తున్నాం. వాటితోపాటు శ్రీవారికి సేవచేసిన ఆళ్వారులు, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ వంటి పరమభక్తుల వివరాలు… శేషాచలం గొప్పదనం, అందులోని జంతువులు, పక్షులు, తీర్థాలు, ఏడు కొండల విశిష్టత వంటి వివరాలు ఉంటాయి. అంతేగాక టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలైన అన్నప్రసాదం వితరణ, ప్రసాదాలు ఎన్నిరకాలు, వాటిని ఎలా తయారు చేస్తారనే అంశాలతో పాటు ప్రత్యేకించి లడ్డూ గొప్పదనాన్ని కూడా తెలుసుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నాం. వీటితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల గురించి కూడా తెలుసుకునేలా ఈ పుస్తకాన్ని తయారుచేస్తున్నాం. ఈ క్రమంలో కడపకు సమీపంలోని ఒంటిమిట్ట శ్రీరాముడి ఆలయ కట్టడం ఓ అద్భుతంగా చెప్పుకోవాలి. మేము చూసిన ఆలయాల్లో ఆ ఆలయం ఎంతగానో నచ్చింది. అందుకే అధికంగా ఫొటోలు తీసుకున్నాం.
‘కాఫీ టేబుల్ బుక్’ ప్రత్యేకత ఇదే…
సాధారణ పుస్తకాలకు ‘కాఫీ టేబుల్ బుక్’కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 70 శాతం ఫొటోలతోనే బుక్‌ను రూపొందిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఫొటోలకు తగిన విధంగా క్లుప్తంగా కథనం ఉంటుంది. కాగా స్వామి వైభవం, క్షే త్రం గొప్పదనం వంటి అంశాలపై టీటీడీ ఇప్పటికే ఎన్నో పుస్తకాలను విడుదల చేసింది. అయితే టీటీడీకి సంబంధించి ఇప్పటివరకు ‘కాఫీ టేబుల్ బుక్’ మాత్రం లేదు. అందుకే టీటీడీ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో టీటీడీ తొలిసారిగా తయారుచేయిస్తున్న ఈ కాఫీ టేబుల్ బుక్‌లో కూడా అధిక శాతం ఫొటోలకే ప్రాధాన్యత కల్పిస్తున్నాం. 250 పేజీలతో కూడిన ఈ పుస్తకం లాండ్‌స్కేప్ ఆకృతిలో ఉంటుంది. ఈ పుస్తకంలో దాదాపు 150 ఫుల్‌పేజీ ఫొటోలు, మరో 50 చిన్న ఫొటోలు ముద్రించేలా చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు 50 నుంచి 60 ఫొటోలు అరుదైనవి ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నాం. ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అర్థమయ్యే ఇంగ్లీషులో వివరాలను ఉంచటంతో పాటు ప్రత్యేక అనుభూతి కలిగేలా తయారుచేసి టీటీడీ చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలనేదే మా ఆకాంక్ష.
త్వరలో విడుదల…
దాదాపు ఏడాది పాటు పరిశీలించి తయారుచేసిన ఈ బుక్ మే నెల రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి దశలో 10వేల కాపీలు ముద్రించే ఆలోచనతో టీటీడీ ఉన్నట్టు మాకు తెలిసింది. టీటీడీ అధికారికంగా తయారు చేయించిన ఈ కాఫీ టేబుల్ బుక్‌ను టీటీడీ పుస్తకకేంద్రాలతో పాటు రాష్ట్రపతి భవన్, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు, అసెంబ్లీ వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ఉంచాలనే ఆలోచనతో టీటీడీ ఉంది. అయితే ‘శ్రీరంగం’ పుస్తకం తరహాలో ఈ పుస్తక విక్రయాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారా లేదా అనేది మాకింకా తెలీదు. తెలుగులోకి అనువదించే అంశంపై వారు స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు అనుకున్న వివరాలన్ని అందుతాయా లేదా అనే భయం ఉండేది. అయితే టీటీడీ అధికారులు ఇచ్చిన సహకారంతో మేము అనుకున్న పనిని వంద శాతం పూర్తిచేయగలిగాం. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం సహకారంతో తిరుమలలో జరిగే ప్రతి ఉత్సవాలకు స్వయంగా హాజరయ్యాం. ఉత్సవాల్లో ప్రతి విషయాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నాం. ప్రత్యేకించి బ్రహ్మోత్సవాలు జరిగిన తొమ్మిది రోజులు తిరుమలలోనే ఉంటూ అద్భుతమైన ఫొటోలు తీశాను. ఏ వాహనం, ఎందుకు నిర్వహిస్తారు, వాటి విశిష్టత ఏంటనే అంశాలను పరిజ్ఞానం ఉన్నవారిని అడిగి వివరాలు సేకరించాం. అలాగే ఇతర అంశాలకు సంబంధించిన వివరాల కోసం టీటీడీ సీనియర్ అర్చకులు, అధికారులు, జీయంగార్లు, ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు తమ అనుభవాలను మాతో పంచుకున్నారు. అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకుని ఈ కాఫీ టేబుల్ బుక్ రాయటానికి ఏడాది కాలం పట్టింది. మేమిద్దరం వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆ బ్రహ్మాండ నాయకుడి సేవలో మాత్రం మాకు పెద్ద శ్రమ అనిపించలేదు. బుక్ చదివిన వారందరికి తిరుమల చరిత్ర తెలిసేలా ఇందులో అద్భుతమైన ఫొటోలు, వివరాలను ఉంచుతున్నాం. చరిత్ర తెలుసుకునేందుకు దాదాపు 50 పుస్తకాలు చదవటంతో పాటు చాలామందితో మాట్లాడి సమాచారం సేకరించాం.
మా పూర్వజన్మ సుకృతం..
ఈ కాఫీ టేబుల్ బుక్ చూడగానే ప్రతీ ఒక్కరికి తిరుమలకు వెళ్లాలనే భావన కచ్చితంగా కలుగుతుంది. భగవద్గీత, షిర్డీ పుస్తకాల తరహాలో భక్తులు తమ పూజగదిలో ‘తిరుమల-కలియుగ వైకుంఠం’ పుస్తకాన్ని పెట్టుకోవాలనేదే మా లక్ష్యం. ఈ బుక్ రూపకల్పన శ్రీవారిసేవ కింద చేస్తున్నాం. టీటీడీ ఆర్థికసాయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మేము నిరాకరించాం. మా సొంతూరు తిరుచ్చి నుంచి తిరుపతికి వచ్చేందుకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు, ఫొటోషీట్లు, ఇతర ఖర్చులను కూడా మేమే పెట్టుకున్నాం. ‘శ్రీవేంకటేశ్వరస్వామి, నేను మంచి స్నేహితులం. దాదాపు 18 ఏళ్ల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఉంటూ ఆయనతో చెలిమి చేశాను. నా గురించి బుక్ రాశావ్ కదా.. ఇక తిరుమలకు వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామి గురించి కూడా రాయండి’ అంటూ శ్రీరంగనాథుడే మమ్మల్ని ఇక్కడికి పంపాడేమో అనిపిస్తోంది. ఈ బృహత్ కార్యాన్ని మేము తలకెత్తుకోవడం మా పూర్వజన్మ సుకృతం.
నా ఫొటోలకు ఆవిడ రచన తోడు..

మా వ్యక్తిగతానికొస్తే… నా వయస్సు 66 ఏళ్లు. దేశంలో చక్కని ఆర్కిటెక్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా నాకు పేరుంది. నా భార్య మంచి డాన్సర్. అలాగే మంచి రైటర్ కూడా. మాకు ఇద్దరు పిల్లలున్నారు. అమ్మాయి, అబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ మేమిద్దరమే ఒకరికొకరం తోడూనీడా. తరచూ హిమాలయాలకు వెళ్లటం మాకు అలవాటు. ఈ క్రమంలో మేము ఓ పుస్తకాన్ని రాయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే తొలుత ‘జాయ్ ఆఫ్ హిమాలయ’ అనే పుస్తకాన్ని రూపొందించాం. ఆ పుస్తకంలోని నా ఫొటోలకు, అందులోని వివరాలు రాసిన నా సతీమణికి మంచి గుర్తింపు లభించింది. దీంతో రెండేళ్ల క్రితం ‘శ్రీరంగం- భూలోక వైకుంఠం’, ‘సర్రియిలిజం’ అనే పుస్తకాలను కూడా విడుదల చేయగా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
జగదీష్ జంగం, తిరుమల
ఫొటోలు: శివయ్య

