18-Feb-2019-Inspection-at-Vishnu-Nivasam

18- ఫిబ్రవరి-2019

భక్తుల సంతృప్తే పరమావధి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

విష్ణునివాసంలో జెఈవో తనిఖీలు
Vishnu Nivasam Tirupati.jpg

This slideshow requires JavaScript.

టిటిడి యాత్రికుల సముదాయాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి భక్తుల సంతృప్తే పరమావధిగా ముందుకెళుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని విష్ణునివాసం వసతి సముదాయంలో గదులు, గదుల కేటాయింపు కౌంటర్లు, టైంస్లాట్‌ టోకెన్‌ కౌంటర్లు, శ్రీవారి సేవ విభాగంతోపాటు అన్నప్రసాద వితరణను పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ విష్ణునివాసంలో ఉన్న సౌకర్యాలు, గదుల లభ్యతను పరిశీలించేందుకు తనిఖీలు చేపట్టామన్నారు. గదుల్లో దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు ఎప్పటికప్పుడు మార్చాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. కొందరు భక్తులు రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం స్లాట్‌తోపాటు సర్వదర్శనం స్లాట్‌ను కూడా బుక్‌ చేసుకుంటున్నారని, ఇలా చేయడం వల్ల ఎక్కువ మంది భక్తులకు అవకాశం రావడం లేదని చెప్పారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఇలా జరగకుండా చూస్తామన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు అర్థమయ్యేలా పలు భాషల్లో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటుచేయాలని, టైంస్లాట్‌ టోకెన్‌ కౌంటర్లు పెంచాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. విష్ణునివాసంలో ఖాళీ స్థలాన్ని భక్తులకు ఉపయోగకరంగా మారుస్తామన్నారు.

తిరుమలకు వచ్చే భక్తులకు సంపూర్ణంగా యాత్ర అనుభవం కలిగేలా ప్యాకేజి టూర్‌ను రూపొందించాలని పర్యాటక శాఖ అధికారులను కోరతామని జెఈవో తెలిపారు. తిరుమలలో ముందుగా శ్రీ వరాహస్వామివారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవాలని, వరుసగా తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారిని, శ్రీగోవిందరాజస్వామివారిని, అదేవిధంగా స్థానికాలయైన శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట, నారాయణవనం, నాగలాపురం ఆలయాలను దర్శించుకోవాలని కోరారు.

జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, విష్ణునివాసం డెప్యూటీ ఈవో శ్రీమతిలక్ష్మీనరసమ్మ, ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.మునిరత్నంరెడ్డి, ఇఇ శ్రీవెంకటకృష్ణారెడ్డి, డిఇ రవిశంకర్‌రెడ్డి, ఏఈవో శ్రీమతి గీత, ఎవిఎస్‌వో రాజేష్‌ తదితరులు ఉన్నారు.

 

 

 

Leave a comment