
Monday, August 06, 2018
11 పెద్ద జలపాతాలు
పేర్లు ప్రకటించిన కలెక్టర్ లక్ష్మీకాంతం


సూర్యారావుపేట(విజయవాడ), న్యూస్‌టుడే: కొండపల్లి అడవుల్లో ఉన్న 11 పెద్ద జలపాతాలకు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం శనివారం రాత్రి అధికారకంగా పేర్లను ప్రకటించారు. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ సభ్యులు 12ఏళ్లపాటు కొండపల్లి అడవుల్లో ట్రెక్కింగ్ నిర్వహించి దాదాపు 100కు పైగా చిన్న, పెద్ద జలపాతాలను గుర్తించారు. వీటిని అధ్యయనం చేసి వాటిలో నుంచి 11 పెద్ద జలపాతాలను ఎంపిక చేశారు. ఆయా జలపాతాల ప్రాశస్త్యం, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ ఛైర్మన్ ఎన్.విష్ణువర్దన్ కొన్ని పేర్లను నిర్ణయించారు. కొండపల్లి అడవుల్లో ఉన్న అందమైన ఈ జలపాతాల వివరాలను తెలుసుకుని కలెక్టర్ లక్ష్మీకాంతం సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. కొండపల్లి, దొనబండ, మూలపాడు అడవుల్లో టెక్కింగ్ కోసం సిద్ధంగా ఉన్న 21 మార్గాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాహస క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. జిల్లా టూరిజం అధికారి డాక్టర్ వెలగా జోషి, రత్నప్రసాద్, కృపాకర్‌రావు, మల్లికార్జున్, అబ్దుల్ ఖలిక్ తదితరులు పాల్గొన్నారు.
- కొంగుధార(కొండపల్లి)
- నెమలిధార (మూలపాడు)
- క్షీరలింగ జలపాతం (మూలపాడు)
- మాదులమ్మ తీర్థం (దొనబండ)
- సప్తస్వర ధారలు (దొనబండ)
- చిట్టి తుంబురు కోన (దొనబండ)
- సీతాకోకల గుండం (మూలపాడు)
- కుడి-ఎడమల జలపాతం (మూలపాడు)
- వనమాలి జలపాతం (కొండపల్లి)
- బేబీ చిత్రకూట్ (కొండపల్లి)
- జడల కొలను (కొండపల్లి)


![]()










ఎన్నెన్నో అందాలు
మూలపాడులో సీతాకోకచిలుకల వనం
ప్రత్యేకంగా 2 కి.మీ మేర కాలిబాట
ప్రకృతి ప్రేమికులకు వరం
అభివృద్ధికి అటవీశాఖ కసరత్తు
పరిశోధన ప్రారంభించిన అధికారులు
ఈనాడు – అమరావతి


ప్రకృతిలోని వర్ణాలన్నీ రెక్కలపై అద్దినట్లు ఉండే సీతాకోక చిలుక అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎంత ఏడ్చే పిల్లలైనా వాటిని చూడగానే టక్కున ఆపి.. కేరింతలు కొడుతూ వాటిని పట్టుకునేందుకు పరుగులు పెడతారు. ఏడు పదులు దాటిన వారు కూడా చిన్న పిల్లల్లా వాటిని చూడగానే తెగ ఆనందపడిపోతారు. కన్ను ఆర్పకుండా వాటిని పరిశీలనగా చూస్తారు. వాటి అందాలను ఆస్వాదిస్తారు. ఒకటి, రెండు సీతాకోకచిలుకలకే అంత సంబరపడి పోతే.. వేల సంఖ్యలో వివిధ రంగుల్లో ఉన్న వాటిని చూస్తే.. వావ్ అనిపిస్తుంది. వాటితో ఆడుకోవాలనిపిస్తుంది. కొండపల్లి అటవీ ప్రాంతంలోని మూలపాడు వెళ్తే వాటి అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మనల్ని చుట్టుముట్టి స్వాగతం పలుకుతాయి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ఈ ప్రాంతానికి వారాంతాలలో యువత, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడి కొండపైకి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోయినా భారీగా వస్తుంటారు. కాంక్రీట్ వనంగా మారిన బెజవాడ నగరం నుంచి మానసిక ప్రశాంతత కోసం మూలపాడు వచ్చి ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. కొత్త ఉత్సాహంతో తిరిగి వెళ్తున్నారు. ఎటువంటి వసతులు లేని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ నడుం బిగించింది. సాధ్యాసాధ్యాలపై కసరత్తు మొదలుపెట్టింది. ఎటువంటి వసతులు లేని మూలపాడులో అన్ని హంగులతో సీతాకోకచిలుకల వనాన్ని అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. దీని కోసం ప్రణాళికలపై పరిశోధన ప్రారంభించింది. వీటిపై వారం, పది రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
* మూలపాడులోని ఈ ప్రాంతంలోకి వెళ్లగానే మనపై ఒక్కసారిగా లెక్కలేనన్ని సీతాకోకచిలుకలు వాలిపోతాయి. ఇక్కడ వేల సంఖ్యలో కనిపించడానికి ప్రధాన కారణం ఇక్కడి వృక్షాలే. ఈ కీటకాలు సాధారణంగా రెండు రకాల చెట్లపైనే ఆధారపడతాయి. ఇవి ఎక్కువ ఉన్న చోటే కనిపిస్తాయి. ఆశ్రయం ఇచ్చే చెట్లపైన జీవిస్తాయి. గుడ్లు పెట్టే దశ, ఆ తర్వాత లార్వా, గొంగళిపురుగు నుంచి సీతాకోక చిలుకగా మారేది ఈ చెట్లపైనే. నిమ్మ, సీతాఫలం, కరివేపాకు, అశోకా, ఆముదం, తదితర చెట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటంతో వీటి సంఖ్య భారీగా పెరిగింది.
* దీనికి తోడు ఇవి జీవించడానికి మకరందాన్ని పీల్చేందుకు పలు పుష్పాలపై ఆధారపడతాయి. వీటి నుంచి తేనెను తీసుకుంటాయి. సబ్జా, గన్నేరు, తులసి, బంతిపూలు, లిల్లీ తదితర పూల నుంచి మకరందాన్ని జుర్రుకుంటాయి. ఇలా రెండు రకాల చెట్లు అధికంగా ఉండటంతో వీటి సంతతి అనూహ్యంగా పెరిగింది. ఇవి కాలుష్య కారకాలు, స్వచ్ఛమైన గాలి ఉన్న చోటే కనిపిస్తాయి. పురుగు మందులు చల్లిన మొక్కలపై వాలవు. ఇవి తిరిగే చోట ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నట్లు భావిస్తారు.
ప్రత్యేక వనం అభివృద్ధి
* మూలపాడులో వసతులు కల్పించే లక్ష్యంతో అటవీశాఖ కదులుతోంది. దీని కోసం ఇప్పటికే ఓ ప్రణాళికను రూపొందించుకుంది. ఎక్కువ మంది పర్యటకులను ఆకర్షించేలా ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సీతాకోక చిలుకల పార్కును ఏర్పాటు చేయనున్నారు. వీటి సంతతి మరింత అభివృద్ధి చెందేలా చూడనున్నారు. వీటికి ఆశ్రయమిచ్చే చెట్లను మరిన్ని పెంచనున్నారు. వీటి సంఖ్య పెరగడానికి ఇవి కీలకంగా మారనున్నాయి. సీతాకోకచిలువ జీవిత చక్రం పూర్తయ్యేది వీటిపైనే.
* ఇందులో భాగంగా ప్రతి రకాన్ని ఫొటో తీయించి, వాటికి సంబంధించి ఆధారపడే చెట్లను గుర్తించనున్నారు. ఇక్కడ దాదాపు 50 రకాల సీతాకోకచిలుకలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంపై ఇప్పటికే కొంత పరిశోధన చేసిన ఏపీ బర్డ్ వాచర్స్ సొసైటీతో కలసి అటవీ శాఖ నడవనుంది. ఈ సంఘంతో పాటు, అవసరం మేరకు కొన్ని స్వచ్ఛంద సంస్థల సాయాన్ని కూడా తీసుకోనుంది. వీటి సాయంతో మరింత సమాచారం కోసం పరిశోధనలను చేపట్టనుంది.
* ఇక్కడి జీవవైవిధ్యం, ప్రకృతి సమతుల్యతకు ఇబ్బంది లేకుండా పార్కును ఏర్పాటు చేయబోతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీతాకోకచిలుకల సంతతి పెరుగుతుంది. ఈ సమయంలో గొంగళిపురుగుల దశ నుంచి కీటకంగా మారుతుంది. ఈ ప్రాంతంలో 2 కి.మీ మేర దీన్ని అభివృద్ధి చేయాలని తలపోస్తోంది. ఎక్కువగా వాహనాలు ఇక్కడికి రాకుండా కట్టడి చేయనున్నారు. కాలుష్యం బారిన ఈ ప్రాంతం పడకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ప్రవేశ మార్గాల వద్దనే వాహనాలను ఆపనున్నారు.
* పార్కులా అభివృద్ధి చేసే ప్రాంతంలో కూర్చోవడానికి అనుకూలంగా బల్లలు ఏర్పాటు చేయనున్నారు. 2 కి.మీ పరిధిలోని ఈ ప్రాంతంలో పూర్తిగా కాలినడనకనే తిరగాల్సి ఉంది. మధ్యలో సీతాకోకచిలుక ఆకారంలో పెద్ద బోర్డులు పెట్టనున్నారు. వీటిపై వివిధ రకాల కీటకాల విశేషాలు, వాటి చిత్రాలు, అవి ఏరకమైన చెట్లపై ఆధారపడతాయి, వంటి విశేషాలను కూడా వివరించనున్నారు.
జీవవైవిధ్యాన్ని మెరుగుపరుస్తాం
కొండపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న మూలపాడు బీట్‌లో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని వీక్షించేందుకు ప్రత్యేకంగా కాలిబాటను అభివృద్ధి చేయబోతున్నాం. ఇక్కడ జీవ వైవిధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుంది. ఇప్పటికే రెండు కిలోమీటర్ల మేర మార్గాన్ని గుర్తించాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుభవం ఉన్న స్వచ్ఛంద సంస్థల సాయాన్ని తీసుకుంటున్నాం. త్వరలో వారి ఆధ్వర్యంలో సీతాకోక చిలుకల గణన జరగనుంది. ఈ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం.
అరుదైన జీవవైవిధ్యం
జిల్లాల్లోని ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లి కొండలపై రిజర్వ్ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది జి.కొండూరు మండలం వరకు విస్తరించింది. దట్టమైన ఈ కొండల్లో దాదాపు 30వేల ఎకరాల్లో ఉన్న ఈ అడవిలో పలు వృక్ష జాతులతో పాటు చిరుతలు, నక్కలు, తోడేళ్లు, వంటి పలు జంతువులు కనిపిస్తాయి. ఇందులోని మూలపాడు వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో వివిధ రకాల సీతాకోకచిలుకలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఇంత అరుదైన జీవవైవిధ్యం కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి నిత్యం చాలా మంది ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. శని, ఆదివారాల్లో యువత ద్విచక్ర వాహనాలు, కార్లలో ఇక్కడికి భారీగా వస్తారు. ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. సహజసిద్ధమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ నిర్ణయించింది.
